తిరుమల శ్రీవారికి సీఎం సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించాలి: జనసేన నేత కిరణ్ రాయల్
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామి వారికి ముఖ్యమంత్రి సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించాలని జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. గతంలో ఎన్నోసార్లు డిమాండు చేసినా స్పందించలేదని గుర్తు చేశారు. సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సతీసమేతంగా సమర్పించేలా చూడాలని టీటీడీ ఛైర్మన్ కరుణాకర రెడ్డి విన్నవించారు. బ్రహ్మోత్సవాలలో పట్టువస్త్రాలు సమర్పించేది ఇదే చివరిసారి కాబట్టి ఈ సారైనా కుటుంబసమేతంగా సమర్పించాలన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడం ఖాయమని తెలిపారు. సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించకపోతే ఆందోళనలు చేపడతామని కిరణ్ రాయల్ హెచ్చరించారు. కాగా నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకూ తిరుమల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నేడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సీఎం జగన్ పట్టువస్త్రారు సమర్పించనున్నారు. అదే విధంగా పండగ రోజు అయినా పోలీసులు తమను నిర్బంధించకుండా ఉండాలని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. కనీసం వినాయకచవితి రోజున అయినా తమను ఇబ్బందులు పెట్టొద్దని కోరారు.
Authored byCurated byతిరుమల బాబు|TimesXP Telugu|18 Sept 2023