శాస్త్రోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..
Tirupati: తిరుమలలో సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. అందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుల స్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. ఈ వైఖానస ఆగమంలో అంకురార్ఫణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులను పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.
Authored byCurated byశ్రీనివాస్ గంగం|TimesXP Telugu|18 Sept 2023