హీరో రజినీకాంతే ఇది న్యూయార్కా అని అడిగారు: కేటీఆర్
తొమ్మిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతోందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని చెప్పారు. దేశంలోని ఐటీ ఉద్యోగాల్లో ప్రతి మూడింట్లో ఒక ఉద్యోగం మనదేనని అన్నారు. హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ పరిశ్రమకు కేటీఆర్ సోమవారం (మే 15) భూమిపూజ చేశారు. అనంతరం అక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తనతో అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. తాను 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌కు వచ్చానని తెలిపిన రజినీకాంత్.. బంజారా హిల్స్‌ను చూసి ఇది న్యూయార్కా? హైదరాబాదా? అని అడిగారని తెలిపారు. ‘ఆయన ఉండేది చిన్న పట్టణం కాదు. దేశంలో అంతటా తిరుగుతారు. అలాంటి వ్యక్తే హైదరాబాద్ అభివృద్ధి గురించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మరో పదేళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఒప్పందం ప్రకారం రెండున్నర నెలల్లోనే ఫాక్స్‌కాన్ పరిశ్రమకు సంబంధించిన శంకుస్థాపన పూర్తి చేశామని తెలిపారు. కొంగరకలాన్‌లో రూ.1,655 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు.hyderabadTimesXP TeluguUpdated: 15 May 2023, 3:28 pm